0

అంగన్‌వాడీ కిచిడీలో ఉడికించిన కప్ప


కోల్‌కతా: పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే యోచనతో ప్రభుత్వాలు నడిపిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు, ఆ చిన్నారులను తరచూ అస్వస్థతకు గురి చేస్తున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆహారం కలుషితమై పిల్లలను తీవ్ర అనారోగ్యాలపాలు చేస్తున్నాయి.


తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బిర్భూమ్ జిల్లాలోని రాజ్‌నగర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆనంద్‌బజార్ పత్రిక కథనం ప్రకారం.. శనివాంర అలీఘర్ అంగన్‌వాడీ కేంద్రంలో చేసిన కిచిడీ ఉడికించిన కప్ప బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.


స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు రాజ్‌నగర్ బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి(బిడిఓ) దినేశ్ మిశ్రా ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా, కిచిడీ తిన్న ఐదుగురు చిన్నారులు, ఓ గర్భిణి మహిళ అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చేరారు. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

రెండన్నరేళ్ల ఓ బాలుడు కిచిడీ తింటుండగా అందులో ఉడికిన కప్ప బయటపడింది. దీంతో అతడు కేకలు వేశాడు. అయితే అప్పటికే ఐదుగురు చిన్నారులు, ఓ గర్భిణి మహిళ కిచిడీని తినేశారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ అంగన్వాడీ కేంద్రానికి నోటీసులు జారీ చేసినట్లు శిశు సంక్షేమ ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో సదరు అంగన్వాడీ కేంద్రాన్ని భారత ప్రభుత్వం 1975లో ప్రారంభించింది.


Previous
Next Post »