0

శస్త్రచికిత్స చేస్తుంటే ఫోన్ వచ్చింది.. నిండు ప్రాణంపోయింది


బెంగుళూరుకు చెందిన ఓ వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణంపోయింది. తీవ్రమైన కడుపునొప్పితో అలమటిస్తూ ఆస్పత్రికి వచ్చిన ఓ యువకుడికి ఆపరేషన్‌ నిర్వహించిన వైద్యుడు... తన అశ్రద్ధ కారణంగా కడుపులో బ్యాండేజీని వదిలేసి కుట్లు వేశాడు. ఫలితంగా నిండుప్రాణం బలైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ బసవేశ్వర మెడికల్‌ కాలేజీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఈ వివరాలను పరిశీలిస్తే మార్చి 24వ తేదీన తీవ్రమైన కడుపునొప్పి (అపెండిక్స్‌)తో వెంకటేష్‌ (24) అనే యువకుడు డాక్టర్‌ మురళీధర్‌ వద్దకు వచ్చాడు. దీంతో అదే రోజున అత్యవసరంగా శస్త్ర చికిత్స నిర్వహించాడు. కొద్దిరోజులకే మళ్లీ తీవ్రంగా కడుపునొప్పి ప్రారంభం కావడంతో పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన వెంకటేష్‌కు స్కానింగ్‌ జరుపగా కడుపులో పెద్ద బ్యాండేజీ కనిపించింది. మరోసారి ఆపరేషన్‌ నిర్వహిస్తానని సదరు వైద్యుడు తెలిపినా భయంతో వెనుకాడిన యువకుడు ఈ సారి ఉడిపిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో చేరాడు. 

ఈ లోపు కడుపులోని బ్యాండేజీని బయటకు తీసేందుకు ప్రయత్నించగా ఆపరేషన్‌ వికటించి గురువారం మృతి చెందాడు. వెంకటేష్‌ మృతికి డాక్టర్‌ మురళీధర్‌ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఆయనను కోర్టుకీడ్చే సన్నాహాల్లో ఉన్నారు. ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో డా మురళీధర్‌ మొబైల్‌కు కాల్‌ రావడంతో మాట్లాడుతూ పొరబాటున బ్యాండేజీని కడుపులో ఉంచేసి కుట్లు వేసినట్లు పోలీసుల ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 


Previous
Next Post »