ఎక్కడైనా తమపై దాడి చేసినవారిని పోలీసులు కుళ్ళ బొడుస్తారు. తమ లాఠీలకు పని చెప్పి రఫ్ఫాడేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బస్తీవాసులే ఖాకీల భరతం పట్టారు. మగాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వీరనారుల్లా చెలరేగిపోయి పోలీసుబాబుల వీపులు మోతలు మోగిస్తూ వాళ్లకు చుక్కలు చూపారు. బురద కాలువలోకి తోసేసి చెప్పులతో బాదారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఈ నెల 10న జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను గర్భవతిని చేశాడని, స్థానికులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయవలసిందిగా కోరగా వాళ్ళు కేసు పెట్టకుండా లంచం డిమాండ్ చేశారని దీంతో ఆగ్రహించిన బస్తీవారు పోలీసులపై తిరగబడ్డారని తెలుస్తోంది.
అయితే..మరో కథనం ప్రకారం..శైలా రాణాసింగ్ అనే లేడీ డాన్ అరాచకమే ఇదట..తన జోలికి వచ్చిన ఖాకీలను ఆమె ఉతికి ఆరేసిందని కూడా అంటున్నారు. భువనేశ్వర్‌లోని హల్దీపాడియా ప్రాంతంలో ఇంటి అద్దె చెల్లించనందుకు ఓ వ్యక్తిని ఈ లేడీడాన్ స్తంభానికి కట్టేసి టార్చర్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందిందని, ఆ వ్యక్తిని విడిపించడానికి ఇన్స్‌పెక్టర్ రజత రాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆ ప్రాంతానికి వెళ్ళగా శైలా రాణాసింగ్ అనుచరులు రెచ్చిపోయి ఆ పోలీసు అధికారిని వెంటాడి కొట్టారని, అతడ్ని మురికి కాలువలోకి నెట్టి అతని ఒళ్ళంతా బురదమయం చేశారన్నది మరో కథనం. మిగతా పోలీసులు కూడా పలాయనం చిత్తగించారు.
కొంతమంది ఖాకీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుమారు 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శైలా పారిపోయినట్టు తెలుస్తోంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon