న్యూఢిల్లీ: మార్కెట్లో కేజీ మటన్ ధర రూ. 300. అదే మసాలా దోశె రూ. 20 నుంచి 40 మధ్యలో ఉంటుంది. కానీ పార్లమెంట్ క్యాంటీన్‌లో మన ఎంపీలకు మాత్రం కారు చౌకకే అందుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో 60.7 కోట్ల రూపాయలను ఎంపీలు సబ్సిడీని ఉపయోగించుకున్నారు.
పార్లమెంట్ క్యాంటిన్‌లో
మన ఎంపీలు రుచికరమైన మటన్ కర్రీని రూ. 20కి, మసాలా దోశెను రూ. 6కే తింటున్నారు. దీనికి కారణం పార్లమెంట్ క్యాంటీన్‌లో అందుతున్న సబ్సిడీ వల్లనే. ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ దరఖాస్తుతో ఈ వివరాలన్నీ వెలుగుచూశాయి.
పార్లమెంటు క్యాంటిన్‌లో లభ్యమవుతున్న పదార్థాలు, వాటి ఖరీదు వివరాలతో కూడిన జాబితాను అధికారులు వెల్లడించారు. ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫ్రైడ్ ఫిష్, చిప్స్ ప్లేట్ రూ.25కు, మటన్ కట్‌లెట్ రూ.18, నూనెతో చేసిన కూరలు రూ.5, మటన్ కర్రీ (బోన్) రూ.20, మసాలా దోశ రూ.6. ఇవి వరుసగా 63 శాతం, 65 శాతం, 83 శాతం, 67 శాతం, 75 శాతం చొప్పున ఎంపీలు సబ్సిడీ పొందుతున్నారన్నమాట.
ఉడికించిన కూరగాయల పదార్థాన్ని తయారుచేయడానికి రూ.41.25 అవుతుండగా, ఎంపీలకు కేవలం నాలుగు రూపాయలకే లభ్యమవుతోంది. అంటే 90 శాతం కన్నా పైగా సబ్సిడీ పొందుతున్నారు. మాంసాహార పదార్థాన్ని తయారుచేయడానికి రూ.99.05 ఖర్చు అవుతుండగా, ఎంపీలకు రూ.33 రూపాయలకే అమ్ముతున్నారు.
ఇక పాపడ్ ఖరీదు రూ.1.98 ఉండగా, ఎంపీలకు రూపాయికే దక్కుతోంది. అంటే 98 శాతం సబ్సిడీ అన్నమాట. ఇక పార్లమెంటు క్యాంటిన్‌కు లాభం వచ్చే ఒకే ఒక్కటి రోటీ మాత్రమే. తయారీకి 77 పైసలు అవుతుండగా, రోటీని రూపాయికి విక్రయిస్తున్నారు.
‘ఖొమాని కా మీఠా'ను మార్కెట్ ధరకే అంటే రూ.15కు అందిస్తున్నట్లు ఆర్టీఐ దరఖాస్తుకు అధికారులు ఇచ్చిన వివరాల్లో పొందుపరిచారు. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలన్నీ 2010 నాటివి. అప్పటినుంచి వీటిని పెంచలేదు. పార్లమెంటు క్యాంటీన్లు ఉత్తర రైల్వే అధీనంలో నడుస్తున్నాయి.
ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ భండార్, మదర్ డైరీ, డిఎంఎస్ వంటి సంస్థలు క్యాంటిన్‌కు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తాయి. జీతం, ఇతర అలెవన్సులు కలిపి నెలకు సుమారు రూ. 1.4 లక్షలకు పైగా అందుకుంటున్న ఎంపీలకు మార్కెట్ ధరకే ఆహారాన్ని విక్రయించి సబ్సిడీలను తక్షణమే రద్దు చేయాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ కోరారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon