0

ఉరి వేసుకుంటుండగా.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన కుక్క



ఆదిలాబాద్: జిల్లాలో ఓ శునకం వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఓ వ్యక్తి ఉరేసుకుంటుండగా చూసిన కుక్క.. పెద్దగా అరుపులు చేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు అతని ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన లక్ష్మణచాంద మండలంలోని మునిపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. మునిపెల్లి గ్రామానికి చెందిన పందికొండ శ్రీనివాస్(38) పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. రోజుమాదిరిగానే గ్రామ సమీపంలోని గోదావరి నది వద్దకు పశువులను మేతకు తీసుకెళ్లారు. అతనితోపాటు మరికొందరు అదే ప్రాంతంలో గొర్రెలను, పశువులను మేత కోసం తీసుకొచ్చారు.


కాగా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్.. ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించాడు. తనవెంట తెచ్చుకున్న తాడుతో అక్కడే ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ శునకం అతడ్ని చూసి పెద్ద అరుపులు పెట్టింది. 

గమనించిన ఇతర కాపర్లు అనుమానం వచ్చి అక్కడి వెళ్లి చూడగా.. ఉరివేసుకుంటూ శ్రీనివాస్ కనిపించాడు. దీంతో వెంటనే అతడ్ని కాపాడిన కాపర్లు, అంబులన్స్‌కు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న అతనికి 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స నిర్వహించి నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలితపారు.



Previous
Next Post »