ఓ ఆత్మహత్య.. కానీ అడుగడుగునా మిస్టరీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన రిషితేశ్వరి సూసైడ్ వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా రిషితేశ్వరి కేసులో వెలుగులోకి వచ్చిన పేరు Mr.X. ఈ మిస్టర్ ఎక్స్ ఎవరు..? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ సాగుతోంది.
రిషితేశ్వరి వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతున్న కేసులో అకస్మాత్తుగా మిస్టర్ ఎక్స్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఎవరా మిస్టర్ ఎక్స్.? అసలు రిషితేశ్వరి వ్యవహారానికి అతనికి ఏంటి సంబందం..? ఎవరు అతడిని కాపాడాలని చూస్తున్నది ఎవరు..? ఇలా ఎన్నో ప్రశ్నలు కానీ సమాధానాలు మాత్రం కనిపించడం లేదు. అంతకంతకు వివాదాస్పదంగా మారిన రిషితేశ్వరి కేసులో మిస్టర్ ఎక్స్ పాత్ర ఏంటి అన్నది అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న.
రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత డైరీలో " My LAST NOTE" పేరుతో రాసిన సూసైడ్ నోట్ మాత్రమే పోలీసులు బహిర్గతం చేశారు. అయితే, మిగతా పేజీలను ఎందుకు బయటపెట్టలేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఏ సందర్భంలో ఆమెకు బాధ కలిగిందో, ఎప్పుడు మనోవేదనకు గురైందో తెలుపుతూ ఆమె మరో ఐదు పేజీలు తన డైరీలో రాసుకుంది.
ఆ పేజీల్లో రిషితేశ్వరి ఐదుగురు తనను వేధించినట్లు రాసింది. డైరీ పేజీల్లో వారి పేర్లు రాసి ఉన్నప్పటికీ.. ఆ పేర్లు కొట్టేసి ఉన్నాయి. రిషితేశ్వరి కొట్టేసి ఉంటుందనుకుంటే అప్పటి వరకూ బ్లూ ఇంక్ తో రాసిన పేర్లను అదే ఇంకుతో కొట్టేసి, మిస్టర్ X అని రెడ్ ఇంక్ తో ఎందుకు రాస్తుందనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
రిషితేశ్వరి కేసులో సామాధానాలు లేని ప్రశ్నలు ఇవే...
* రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న రోజు మొదట డైరీని గమనించిందెవరు? ఒక వేళ పోలీసులే గమనించి ఉంటే ఆ డైరీపై ఉన్న ఫింగర్ ప్రింట్లను సేకరించారా?
* రిషితేశ్వరి డైరీ లో కేవలం మూడు పేజిలే ఎందుకు చూపించారు...? మిగతా పేజిలని ఎందుకు బహిర్గతం చేయలేదు...?
* తాను ఆత్మహత్య చేసుకున్నప్పుడు గదిలోకి వెళ్ళగానే డైరీని మొదట చూసింది ఎవరు...?
* రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ గదిలోకి వెళ్లిన సీనియర్ విద్యార్థులెవరైనా డైరీని గమనించి పేర్లను కొట్టివేశారా.. లేదా మరెవరైనా కొట్టేశారా..?
* నిందితులను రక్షించాలి అని అనుకుంటోండి ఎవరు...?
* డైరీలోని శ్రీనివాస్ అనే పేరు మాత్రం ఎందుకు వదిలేశారు...?
* ఇంతవరకు ఆ డైరీని రిషితేశ్వరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎందుకు చూపలేదు..?
రిషితేశ్వరి డైరీలో రిషితేశ్వరి స్వయంగా రాసిన నాలుగుపేర్లు కొట్టేసారు. క్యాంపస్ లో అడుగుపెట్టిన తర్వాత నుండి అనుక్షణం తాను అనుభవించిన నరకయాతనను రిషితేశ్వరి అక్షరాలుగా మలిచింది. అయితే, రిషితేశ్వరి రాసిన డైరీలో ఉన్న పేర్లను ఎవరో చెరిపేసారు.
ఈ బతుకు బతకడం కంటే, చావే నయం అన్నంత నిస్సహాయ స్థితికి ఆమెను నెట్టేసిన నలుగురి పేర్లను ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఆ నలుగురూ ఎవరు? ఆ పేర్లను చెరిపేసిందెవరు? వారిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నదెవరు? అసలు పేరు కొట్టేసి మిస్టర్ ఎక్స్ అని రాసిందెవరు? సూసైడ్ నోట్‌లో మిగతా వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. ఆమె చేతిరాత అలాగే ఉంది. వాక్యాలు, పేరాగ్రాఫ్‌లు యధాతధంగా ఉన్నాయి.
కానీ.. నాలుగు చోట్ల.. నాలుగు పేర్లు మాత్రంకొట్టేసి వున్నాయి.. అదీ అలా ఇలా కాదు.. ఫోరెన్సిక్ నిపుణులు సైతం కనిపెట్టలేనంతగా దిద్దేసి ఉంది. కనీసం పేరులోని మొదటి అక్షరం, చివరి అక్షరం కూడా కనిపించనంతగా బాల్ పెన్‌తో దాన్ని దిద్దేశారు. పైనే మిస్టర్ ఎక్స్ అని రాశారు. ఇప్పుడీ మిస్టర్ ఎక్స్ ఎవరన్నదే అసలు క్వశ్చన్. ఆ ఎక్స్‌ని కాపాడటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారన్నదే అంతు చిక్కని సంగతి. ఈ నలుగురూ కూడా వివిధ సందర్భాల్లో తనను వంచించి, తన జీవితంతో ఆడుకున్న వాళ్ళేనని రిషితేశ్వరి రాసుకుంది.
క్యాంపస్ లో విద్యార్థుల్లా ఉన్న మృగాళ్లు చేస్తున్న ఆగడాల మీద రిషితేశ్వరి మనసు లోతులోంచి రాసిన ప్రతి అక్షరం అక్కడి కన్నీటి చరిత్రకు సాక్షం. కానీ ఆ చీకటి కోణాన్ని వెలుగులోకి రాకుండా రిషితేశ్వరి ఆత్మహత్యతో క్యాంపస్ లోని మృగాళ్ల అసలు రూపాలు బయటపడుకుండా చేసింది ఎవరు..? మిస్టర్ ఎక్స్ అని రాసింది ఎవరు..? పోలీసులు ముందు డైరీని ఎందుకు రిషితేశ్వరి తల్లిదండ్రులకు ఇవ్వలేదు..? ఇలా ఎన్నో ప్రశ్నలు.
కానీ వాటికి సమాధానాలు మాత్రం దొరకడం లేదు. రిషితేశ్వరి కేసులో మిస్టరీలో మిస్టర్ ఎక్స్ పాత్ర ఎంత..? నిజం నిప్పులాంటిది కానీ ఆ నిప్పును కంటికి కనిపించడకుండా చేస్తున్నారు అది చాలా క్లీయర్ గా అర్థమవుతోంది. రిషితేశ్వరి కేసులో ప్రతి విషయాన్ని లోతుగా దర్యాప్తు చెయ్యాల్సిన అవసరం ఉంది. డైరీలోని ప్రతి పేజీ, పేజీలోని ప్రతి అక్షరం వెనుక రిషితేశ్వరి మనోవేధన వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon