0

మామిడి పళ్లు అమ్ముతున్న సీనియర్ ఎంపి కుమార్తె


రాంచీ: ఆమెది మంచి రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఆమె తండ్రి ఏకంగా 8సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆమె కూడా ఓ ప్రొఫెసర్. అయినా ఆమె వీధుల్లోకి వెళ్లి మామిడి పళ్లు అమ్ముతున్నారు. ఎందుకంటే సమాజ సేవ చేసేందుకే తాను ఈ పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆమే జార్ఖండ్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్, 8 సార్లు ఎంపీగా గెలిచిన కరియా ముండా కూతురు చంద్రావతి సరు. తాను ఆర్థిక అవసరాల కోసం ఈ పని చేయడం లేదని, ఇతరులకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నట్లు తెలిపారు.

తాను వీధుల్లో మామిడి పళ్లు అమ్మడాన్ని అవమానంగా భావించడం లేదని చెప్పారు. ఆమె జార్ఖండ్ రాజధాని రాంచీకి 40 కిలోమీటర్ల దూరంలోని కుంతి వీధుల్లో మామిడి పళ్లు అమ్ముతున్నారు. తాను తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని చెప్పారు.

అవసరమున్న వారికి సాయం చేయడమే తన తండ్రి నుంచి నేర్చుకున్నానని తెలిపారు.

‘మామిడి పళ్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని అవసరం ఉన్నవారికి, పేదలకు అందజేస్తాను. ఎప్పుడూ మూలాలను మర్చిపోవద్దని మా తండ్రి చెప్పేవారు. నా తండ్రి నుంచి నేర్చుకున్నదే నేను చేస్తున్నా' అని చంద్రావతి సరు చెప్పారు. యువత కూడా వారి చేస్తున్న కుల వృత్తులను అవమానంగా భావించవద్దని, వ్యవసాయాన్ని వృత్తిగా సేకరించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.


కాగా, కరియా ముండా కూడా ఇప్పటికీ ఒక చిన్న ఇంటిలోనే ఉంటారు. రాజకీయంగా ఎంతో ఎదిగినప్పటికీ.. సాధారణ జీవితాన్నే ఆయన ఇష్టపడతారు. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ఆయన పొలం పనుల్లో బిజీ అవుతారు. అతని ఇంటి ఆవరణను స్వయంగా శుభ్రం చేసుకుంటారు.
Previous
Next Post »