0

అప్పట్లో మా ఆవిడ ఐశ్వర్యారాయ్..! మరి ఇప్పుడు..?

aishwarya rai turns into rai
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. ఆరోజుల్లో, ఇంకాచెప్పాలంటే మా కాలేజీ రోజుల్లో ఐశ్వర్యారాయ్ అంటే కుర్రకారు కిక్కెక్కించే అందాల అప్సరస, నేనైతే ఐష్ కి వీరాభిమానిని, ఐష్ ని ఊహించుకుంటు ప్రతిక్షణం గడిపేసే వాడిని, ఐష్ ఊహల్లో ఎన్నోనిద్రలేని రాత్రులు. ప్రియా ప్రియా చంపొద్దే.. నవ్వి నన్నే.. ముంచొద్దే, అంటూఎన్నిసార్లు పాడుకున్నానో చెప్పడం కష్టమే. పలికే గోరింక చూడవేనా వంకా, ఇక వినుకో నా మది కోరిక, అంటూంటే నేనే ఆ గోరింకలా గ్లోబ్ అంతా తిరిగిన ఫీలింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పాటలేసుకున్నాను.. ఐష్ నా ముందే ఉందని ఊహించుకుని ఎన్ని గంటలు మాటలాడుకున్నాను.
కాలగమనంలోఎన్నోమార్పులు. నేను బయట పెట్టుకోకూడదు కానీ నా భార్యలో నాటి నిగారింపు, సింగారింపు, వన్నెలు, చిన్నెలు, మెరుపులు, మలుపులు భూతద్దం పెట్టివెతికినా, మచ్చుకైనా కనపడట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐశ్వర్య రాయ్ లో ‘ఐశ్వర్య’ పోయి ‘రాయి’ మిగిలింది. ఎప్పుడైనా మనసాపు కోలేక ఈ ప్రస్తావన నా పెళ్ళాం దగ్గరతీసుకొస్తే… గయ్ గయ్ మంటూ ఒంటి కాలి మీద లేస్తుంది.
మగవాళ్లు సౌందర్యోపాసకులు, ఆడవాళ్లు సౌందర్యరాశులు, కాస్త అందంపట్ల ఆరోగ్యంపట్ల అవేర్నెస్ ఉండాలి అంటూ అనునయంగా చెప్పబోతే 'ఇంటి పని, పిల్లల హోం వర్క్ ల తోటే నాకు సరిపోతోంది, ఇక జిమ్ లకి, బ్యూటి పార్లర్లకి తిరిగే టైం ఎక్కడుంది. నేనింకా కుర్ర పిల్లని అనుకున్నారా..? పెళ్ళయి పదేళ్ళు అయింది, అయినా పెళ్లి చేసుకున్న తర్వాత అందం పెరగదు, బాధ్యతలు పెరుగుతాయి. అర్థం చేసుకోకుండా నీ కామెంట్లు ఒకటి. మీ వంశాన్ని ఉద్దరించడానికి ఇద్దరు పిల్లలను కన్నాను. దాంతోనే నా గ్లామర్ గాల్లో కలిసింది. నా అందాలన్నీ అరిగిపోయాయి, కరిగిపోయాయి, ఎన్నిమందులు మింగాను హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నాను, రకరకాల భాధలుపడ్డాను, పడుతున్నాను. అనాలని కాకపోతే ఇవన్నీమీకు తెలియనివా..' అంటూ తెగేసి తెగ లెక్చర్లు ఇస్తుంది. తను చెప్పేవన్నీ నిజమేకావచ్చు కానీ.. ఒప్పుకోడానికి మనసు ఒప్పుకోవడంలేదు.
ఎవరితో చెప్పుకోవాలో తెలియదు.. ఆఫీసులో టైట్ ఫిట్ జీన్స్ తో పిటపిటలాడే సన్నీలియోన్ లాంటి గర్ల్స్ మధ్య పనిచేసే నేను, వాళ్ళతో మా ఆవిడని పోల్చుకుని ఒకటే బాధపడటం. ఈ స్థితిలో నన్ను పూర్తిగా చదివేసిన నా బెస్ట్ ఫ్రెండ్ వస్తే వాడిముందు నా బాధ వెళ్లగక్కాను. వాడు పగలబడినవ్వాడు.. 'ఒరే అప్పటి నీ డ్రీం గర్ల్ ఐష్.. ఇప్పుడు డ్రీం మదర్ అయ్యింది రా.. ఈ మధ్య చూసావా ఐశ్వర్యారాయ్ ని.. నువ్వొప్పుకున్నా ఒప్పుకోపోయినా.. చాలామార్పులు వచ్చాయిరా.. పెళ్ళయి పిల్లల్ని కన్న తర్వాత కూడా కుర్రపిల్లలా ఉండటం సినిమా హీరోయిన్లకే కుదరదు. పాపం మీ ఆవిడ మాత్రం ఏం చేస్తుంది..? ఇప్పుడు మీ ఆఫీసు లో నీకు సీతాకోక చిలుకల్లా, సన్నీలియోన్ లా కనిపిస్తున్న అమ్మాయిలు కూడా రేపు పెళ్ళిచేసుకుని పిల్లల్ని కంటే చిప్స్ పాకెట్ లాగా ఉబ్బిపోతారు. అందం శాశ్వతం కాదు రా. మీ ఆవిడ ఐష్ అంత అందంగా లేకపోవచ్చు, కాని అందమైన మనసు ఉందిరా.' ఇలా వాడు క్లాస్ పీకి చక్కాపోయాడు..
నాకు వాడిమాటలలో పెద్ద రిలీఫ్ దొరికింది. అప్పుడే గుడికెళ్లి వచ్చి.. నా చేతిలో కొబ్బరిముక్క పెడుతున్న నా అర్ధాంగిని క్లోజ్ లో చూస్తే చెప్పలేనంత అందంగా కనిపించింది. అందం అనేది ఓ మధురమైన భావన, అదిఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, దానిని ఆస్వాదించాలంటే మనం చూసే చూపు మారాలి మన మనసు అందంగా ఉండాలి. అప్పుడు ఈ జగమంతా సౌందర్యమయమే అవుతుంది, అందుకే మా ఆవిడ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ, అద్భుతమే. నా సొంతమే..!!
Previous
Next Post »